Showing posts with label సన్నపురెడ్డి. Show all posts
Showing posts with label సన్నపురెడ్డి. Show all posts

Saturday, 17 February 2007

నేను-తను

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు-
మేమిద్దరం చెరో ధ్రువం వైపు విసిరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణచిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది

ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మా మధ్య చెలియలికట్టలా పడుకుని ఉన్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోలసాగరమై ఎగిసిపడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయశకలాల్ని కూర్చుకుంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది

టైం కి డ్యూటీ కొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్రలేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు-అభిప్రాయం కాదు సమస్య-
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం
అంతకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమౌతోంటే
నేననుకొంటున్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనదుకు
నాలోని మరో నేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకుంటుంటాను
ఇప్పుడు-భేదభావం కాదు ప్రశ్న-
ఆమె అబలత్వం తీవై సాగి సాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స'మర్ది'స్తూ
నాపైకి ఎగబాకలేదనే!

క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయిచబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్ధమౌతుంది
ఆమె చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని ఉంటుంది

మనోగవాక్షలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటిబిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా-
నేను నీటిబుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై అబలనై పసిపాపనై గారాలు పోతాను

Monday, 22 January 2007

సన్నపురెడ్డి నవలల సవ్వడి

ఒకే సంవత్సరం జరిగిన 3 నవలల పోటీల్లో ఒకే రచయిత రాసిన నవలలకు ప్రథమ బహుమతులు లభించడం అపూర్వం, అనితర సాధ్యం. అది 2006లో సన్నపురెడ్డి సాధించిన ఘనత. ఈయన రాసిన ఆ మూడు నవలలు:
తోలుబొమ్మలాట 2006 ఆటా పోటీలలో ప్రథమ బహుమతి (ఈ నవల సాహిత్యనేత్రం అక్టోబర్ 2006 సంచికలోను, ఆటా వారి 9వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికలోను ప్రచురితమైంది).
పాలెగత్తె 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో ప్రథమ బహుమతి
చినుకుల సవ్వడి 2006లో నిర్వహించిన చతుర నవలపోటీలో ప్రథమ బహుమతి
సాధించాయి.
ఎవరీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి?
ఈయన ఒక మారుమూల పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
1980లలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం "కవితా! ఓ కవితా!!" లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. తర్వాతి కాలంలో రచన మాసపత్రికలో ఈయన కవితలు చదివిన యండమూరి వీరేంద్రనాథ్ "(ఇంత) బాగా రాయగలవాళ్ళు ఎక్కువగా ఎందుకు రాయరో నాకు అర్థం కాదు." అని రాశాడు. (స్వతహాగా కవి కావడం వల్లేనేమో నిండుకుండ నెత్తినపెట్టుకుని అడుగులేస్తూ ఉంటే నీళ్ళు చిందినంత సహజంగా సన్నపురెడ్డి రచనల్లో కవిత్వం ఒలుకుతూ ఉంటుంది.) 1990ల ప్రారంభంలో కథలు రాయడం ప్రారంభించిన ఈయన అచిరకాలంలోనే విస్మరించరాని కథారచయిత గుర్తించబడ్డాడు. సన్నపురెడ్డి కథలను రెండురకాలుగా విభజించవచ్చు: మంచి కథలు, గొప్ప కథలు. ఈయన రాసిన కథలు రాతిపూలు, కథాసాగర్, విశాలాంధ్ర తెలుగుకథ మొదలైన కథాసంకలనాల్లో చోటు సంపాదించుకున్నాయి.

ఇక ఈయన రాసిన తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందదమేగాక చిరస్థాయిగా నిలిచిపోగల అతికొద్ది తెలుగు నవలల్లో ఒకటిగా గుర్తించబడింది. తర్వాత ఆయన స్వాతివారపత్రిక లో పాండవబీడు అనే నవల రాశాడు. అప్పటికే నా దృష్టిలో స్వ+అతి గా మారిన స్వాతి వారపత్రికను నేను కేవలం ఈ సీరియల్ కోసమే చదివేవాడిని. ఆ సీరియల్ ముగిసినవెంటనే అదీ మానేశాను. మళ్ళీ దానిజోలికి పోలేదు. ఇప్పుడు మళ్ళీ పాలెగత్తె కోసం మొదలుపెట్టాల్సి వచ్చేలా ఉంది.

బహుమతులు పొందిన సన్నపురెడ్డి కథలు:

1996లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి కథలపోటీలో అంతు కథ ప్రథమ బహుమతి పొందింది.
అదే సంవత్సరం సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో చనుబాలు కథ ప్రథమబహుమతి పొందింది.
ఇవే కాకుండా ఈయన తడి, కొత్తదుప్పటి, ఒక్కవానచాలు, గిరగీయొద్దు, ఒక్కవానచాలు, దిగంబరం, ఊరిమిండి లాంటి కథలు రాశాడు.
తెలుగు భాష, సాహిత్యాలకు ఆయన చేసిన సేవకు 2004, 2006 సంవత్సరాలలో అధికారభాషాసంఘం ఆయనను ఘనంగా సత్కరించింది.

1996లో రాతిపూలు సంకలకర్తలు ఈయన గురించి ఇలా అన్నారు:

చాలామంది రచయితలకు లేని వైవిధ్యభరిత జీవితానుభవం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - అటువంటి గ్రామీణ జీవితానుభవసారం ఉండబట్టే "కవిత్వాన్నీ, కథనీ కోపుయాస లేని ఎద్దులుగా సాహిత్య వ్యవసాయాన్ని" చేస్తున్నాడు.
కవితల్లో వ్యక్తీకరించలేని భావాల్ని కథల్లో, కథల్లో ఇమడ్చలేని సున్నితవ్యక్తీకరణల్ని కవితల్లో ఒదిగిస్తున్నారు వెంకటరామిరెడ్డి.
పుట్టింది, పెరిగింది, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నది కడప జిల్లా కలసపాడు మండలం బాలరాజుపల్లె కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు.
అంతేకాకుండా పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని - వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి - ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.